: శశి థరూర్ కు లై డిటెక్టర్ పరీక్ష తప్పదా?... సన్నాహాలు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మరణంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు సత్యశోధన పరీక్ష తప్పేలా లేదు. ఆల్ ప్రాక్స్ మందులతో విష ప్రయోగం చేసిన కారణంగానే సునంద మరణించిందని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆ సంస్థ పంపిన నివేదికను పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు కూడా దానిని ధ్రువీకరించారు. దీంతో కొత్త కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు సునంద పుష్కర్ చనిపోయిన హోటల్ పరిసరాల్లోని ఔషధ దుకాణదారులను (కెమిస్ట్) ప్రశ్నించారు. ఈ క్రమంలో మందు బిళ్లలు విక్రయించిన వారితో పాటు ఆ మందులకు బిల్లు చెల్లించిన వారి వివరాలను కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలను వెలికితీసేందుకు శశి థరూర్ కు సత్యశోధన పరీక్షలు నిర్వహించాల్సిందేనని కూడా ఢిల్లీ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.