: ఇప్పటికిప్పుడు కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో ఇస్తాం... సరిపోతుందా?: చినరాజప్ప
కాపులను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తూ, ఇప్పటికిప్పుడు జీవో జారీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అయితే, జీవో ఇచ్చినంత మాత్రాన కాపులు బీసీల్లో చేరిపోయి రిజర్వేషన్లు పొందుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయమై గతంలోనూ జీవో వచ్చిందని, అది కోర్టులో ఉన్న సమయంలో, నిజానిజాలు మరచి మాట్లాడటం సరికాదని కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. నిందను తెలుగుదేశం పార్టీపై మోపే ప్రయత్నం చేయడం సరికాదని, దుర్ఘటనకు, టీడీపీకి సంబంధం ఉందని వ్యాఖ్యానించడం అన్యాయమని అన్నారు. జీవోలు నిలబడవని, అత్యంత క్లిష్టమైన ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చినరాజప్ప తెలిపారు. ముద్రగడ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన, హింసను తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.