: ఇదేనా చట్టం, న్యాయం?... దీర్ఘకాల వాదనలతో విసిగి ఆత్మహత్య చేసుకున్న అత్యాచార బాధితురాలు!


"నేను మరణిస్తే, ఇక నన్నెవరూ వ్యభిచారిణి అని పిలవరు" అంటూ తన మనసులోని బాధను కాగితంపై పెట్టిన ఓ అత్యాచార బాధితురాలు, ఇండియాలోని కోర్టులు, ప్రాసిక్యూటర్ల తీరును తప్పుబడుతూ ఉరేసుకుని తనువు చాలించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, భిలాయ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో ఓ డాక్టర్, ఇద్దరు పోలీసుల కామానికి బలైపోయిన ఓ బీఎస్సీ చదువుతున్న యువతి, కేసు పెట్టగా, గత సంవత్సరం నుంచి ఆ కేసు వాయిదాలపై వాయిదాలుగా సాగుతోందే తప్ప ముందడుగు పడటం లేదు. కామెర్లకు చికిత్స నిమిత్తం వెళ్లిన ఆమెపై అత్యాచారం చేసిన వీరు దాన్ని వీడియో కూడా తీశారు. కేసు విచారణ నిమిత్తం పలుమార్లు కోర్టు చుట్టూ తిరిగిన ఆమెకు విసుగొచ్చింది. పైగా ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు, తన తరఫున వాదించాల్సిన ప్రాసిక్యూటర్, న్యాయం జరిగే అవకాశం తక్కువేనని చెబుతూ ఉండటం తదితర కారణాలతో మనస్తాపానికి గురైంది. అన్ని విషయాలనూ లేఖ రాసి మరీ ఉరేసుకుంది. "నేను ఎప్పుడు కోర్టుకు వెళ్లినా న్యాయమూర్తి ఉండరు. కేసు మరోసారి వాయిదా పడుతుంది. నా లాయర్ కల్పనా దేశ్ ముఖ్, కోర్టుల చుట్టూ తిరగడం తప్ప, న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువని చెబుతోంది. కేసు ముందడుగు పడటం లేదు. ఇక నేను బతకలేను. కనీసం చనిపోయిన తరువాతైనా నన్ను వేశ్యగా చూడటం మానేస్తారేమో!" అంటూ లేఖ రాసింది. ఆమె లేఖ ఆధారంగా మరో కేసును నమోదు చేశామని, ముగ్గురు నిందితులతో పాటు, న్యాయవాదినీ ప్రశ్నిస్తామని భిలాయ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News