: ఎవ్వరినీ వదలబోము: అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్
తునిలో ప్రజలను ఉద్రేక పరచి ప్రభుత్వ ఆస్తుల నష్టానికి కారణమైన వారితో పాటు, రైళ్లకు నిప్పు పెట్టిన వారి గురించి ఆరా తీస్తున్నామని అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఈ ఉదయం ఉత్తర కోస్తాంధ్ర జోనల్ ఐజీ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్ తో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తుని ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలను తరలించామని, పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. నిన్న అనుకోకుండా విధ్వంసం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిని ఎవ్వరినీ వదలబోమని స్పష్టం చేశారు. కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రైళ్లకు జరిగిన నష్టానికి రైల్వే పోలీసులు ప్రత్యేక కేసులు పెడతారని తెలిపారు. నిన్న భద్రతా దళాలు చాలినంతగా లేకపోవడమే ఘటనలకు కారణమనడాన్ని ఆయన ఖండించారు. కాగా, మొత్తం రూ. 30 కోట్ల మేర రైల్వే శాఖకు నష్టం వచ్చినట్టు అంచనా వేస్తున్నామని అధికారులు వెల్లడించారు.