: తెలుగు యువత ఉపాధికి ‘ఎన్టీఆర్ ట్రస్టు’ కీలక నిర్ణయం... ‘ఉబెర్’ తో నేడు లోకేశ్ ఒప్పందం


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలోని ‘ఎన్టీఆర్ ట్రస్టు’ ఇప్పటికే కార్యరంగంలోకి దిగింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇటీవలే ట్రస్టు ప్రతినిధి హోదాలో నారా బ్రాహ్మణి ప్రకటించారు. తాజాగా ఆ ట్రస్టుకు చెందిన మరో ట్రస్టీ నారా లోకేశ్ నేడు కీలక అడుగు వేయనున్నారు. యువతకు నేరుగా ఉపాధి అవకాశాలను అందించేందుకు, క్యాబ్ సర్వీసుల్లో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ ‘ఉబెర్ ట్రాన్స్ పోర్టేషన్’తో ఎన్టీఆర్ ట్రస్టు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు యువతకు శిక్షణ ఇస్తాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, శిక్షణ, బ్యాంకులతో అనుసంధానించే బాధ్యతలన్నీ ఎన్టీఆర్ ట్రస్టు చేపడుతుంది. శిక్షణలో ఉబెర్ సంస్థ సహకారం అందిస్తుంది. ఈ మేరకు నేడు ట్రస్టు కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నారా లోకేశ్, బ్రిటన్ నుంచి వస్తున్న ఉబెర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డేవిడ్ ప్లఫ్ ల మధ్య ఒప్పందం కుదరనుంది. ఈ మేరకు ట్రస్టు సీఈఓ విష్ణువర్ధన్ మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News