: సోనియా, రాహుల్ గాంధీలపై అనుచిత వ్యాఖ్యలు... అక్బరుద్దీన్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు
మజ్లిస్ పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోమారు చిక్కులు కొనితెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ లను అవమానపరిచేలా అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ లను తెప్పించుకుని పరిశీలించి, వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు హామీ ఇచ్చారని నిరంజన్ చెప్పారు.