: 139 ఏళ్ల రికార్డును తిరగరాసిన కెప్టెన్ ధోనీ!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ, ఇక వన్డే, టీ20 ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికితే బాగుంటుందని క్రికెట్ దిగ్గజాలు పేర్కొన్నారు. అయితే చివరి వన్డే మ్యాచ్ లో జూలు విదిల్చిన ధోనీ సేన, ఆ తర్వాత మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్ లలో ‘కంగారూ’ జట్టును ధోనీ సేన కంగారు పెట్టింది. ఏ మ్యాచ్ లోనూ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆస్ట్రేలియన్లను వారి గడ్డపైనే మట్టి కరిపించింది. నిన్న జరిగిన చివరి మ్యాచ్ లో విజయం సాధించిన కెప్టెన్ ధోనీ సగర్వంగా టీ20 సిరీస్ కప్ ను అందుకుని ‘మెన్ ఇన్ బ్లూ’కు అందజేశాడు. అప్పుడే క్రికెట్ పండితులకు రికార్డులు గుర్తుకొచ్చాయి. ఆస్ట్రేలియా గడ్డపై పర్యాటక జట్టు ఆ దేశ జట్టుపై ఏ ఫార్మాట్ లోనైనా వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్న ఘటన 139 ఏళ్ల క్రితం జరిగిందట. తాజాగా ఆ రికార్డును బద్దలుకొడుతూ ధోనీ వరుసగా మూడు మ్యాచ్ లలో కంగారూలపై విజయం సాధించి 139 ఏళ్ల నాటి రికార్డును తిరగరాశాడు.