: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు గుండె: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు పట్టణం గుండెకాయలాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడుతూ, పదిహేనేళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని తన ప్రయాణం ప్రారంభించిందని అన్నారు. అలాంటి సందర్భంగా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ పోరాటంలో హైదరాబాదుపై రాజీపడి ఉంటే తెలంగాణ 2007లోనే వచ్చేసేదని కేసీఆర్ అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు 14 ఏళ్లు పట్టిందని ఆయన అన్నారు. 14 ఎఫ్ జీవో తీసుకువస్తే తాను నిరాహార దీక్షకు కూర్చున్నానని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు రణరంగాలయ్యాయని ఆయన తెలిపారు. చంద్రబాబు తెలంగాణ రాకుండా అడ్డుకున్న నాటకం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆయన చెప్పారు. అనేకమంది నాయకులు గట్టి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు. 'కేసీఆర్! నువ్వు హైదరాబాదులో పని చేయ్', 'చంద్రబాబు! ఆంధ్రప్రదేశ్ చూసుకో' అని ప్రజలు తీర్పు ఇచ్చారని కేసీఆర్ అన్నారు. తనను చంద్రబాబు కలిసినప్పుడు 'అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు బజార్లు ఊడ్చుకో' అని చెప్పానని ఆయన తెలిపారు.