: ఆసీస్ పై ప్రతీకారానికి సర్వం సిద్ధం...క్లీన్ స్వీప్ కు టీమిండియా వ్యూహం
ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్ లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగనుంది. తొలి రెండు టీట్వంటీల్లో విజయం సాధించిన భారత జట్టు మూడో టీట్వంటీలో కూడా విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టీట్వంటీల్లో విజయం సాధించిన జట్టునే మూడో మ్యాచ్ లో కూడా కొనసాగించనుంది. ఇప్పటికే సిరీస్ ను సాధించడంతో ఇది నామమాత్రమైన మ్యాచ్ అనే అలసత్వం చూపవద్దని ధోనీ తన జట్టుకు సూచించాడు. దీనికి ముందుగా జరిగిన వన్డేలలో వరుసగా నాలుగు వన్డేలలో ఓటమిపాలైన భారత జట్టు చివరి వన్డేలో విజయం సాధించింది. అనంతరం రెండు టీట్వంటీలు గెలుచుకుంది. దీంతో మూడు మ్యాచ్ లు గెలిచిన భారత్ మిగిలిన మ్యాచ్ లో సైతం విజయం సాధించి, లెక్క సమం చేయాలని భావిస్తోంది. ఇందుకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా మంచి ఫాంలో ఉండడం సహకరిస్తుందని భావిస్తోంది. ఫీల్డింగ్ తప్పిదాలను నివారించి, బౌలర్ బుమ్రా సంధించే విధంగా 'వికెట్ టు వికెట్' బౌలింగ్ చేస్తే భారత్ విజయాన్ని ఆపే శక్తిలేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ కు అశ్విన్, జడేజా మంచి ఫాంలో ఉండడం కలిసివచ్చే అంశమని వారు సూచిస్తున్నారు. ప్రాథమిక అంశాలకు కట్టుబడి బౌలింగ్ చేస్తూ, ధాటిగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.