: యూఎస్ గూఢచారి విమానాన్ని అతి దగ్గరగా వెంబడించిన రష్యా జెట్
సాధారణంగా ఆకాశంలో ట్రాఫిక్ రద్దీ సమయంలో రెండు విమానాలు వందల మీటర్ల దూరంలో ఉండగానే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు వేటికవి దూరంగా వెళ్లిపోతుంటాయి. కానీ రష్యా గగనతలంలో ఈ నెల 25న నల్ల సముద్రంపై గూఢచర్యం చేసేందుకు వచ్చిన యూఎస్ విమానానికి రష్యా జెట్ ముచ్చెమటలు పట్టించింది. విదేశీ మిలటరీ స్థావరాలు గుర్తించేందుకు అమెరికా ప్రత్యేకంగా తయారు చేసిన ఆర్ సీ-135 యూ విమానంలో 21 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా రష్యాకు చెందిన ఫైటర్ జెట్ ఈ విమానం వైపుగా దూసుకువచ్చింది. ఒకానొక సమయంలో ఈ రెండు విమానాల మధ్య గ్యాప్ కేవలం 15 అడుగులు మాత్రమే ఉంది. దీంతో ఆర్ సీ-135యూ విమానం దూరంగా వెళ్లిపోయింది. అనంతరం పెంటగాన్ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. రష్యా చర్య సమ్మతం కాదని తెలిపారు. పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో కూడా ఓసారి ఇలాగే జరిగింది. ఇలాంటి విమానాన్ని అప్పుడు వంద అడుగుల దూరం నుంచి రష్యా జెట్ వెంబడించిందని పెంటగాన్ (అమెరికా రక్షణ వ్యవస్థ కేంద్రం) వెల్లడించింది. కాగా, యూఎస్ గూఢచారి విమానంలో నాలుగు ఇంజిన్లు ఉంటాయి. అత్యాధునిక కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయి. విదేశాలకు చెందిన మిలటరీ స్ధావరాలను గుర్తించడం, ఆయుధసామగ్రిని పసిగట్టడంలో ఈ విమానంది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.