: ముగ్గురి మతాన్ని మార్చిన ఫలితం... వ్యక్తికి గుండు గీసి రోడ్డుపై ఊరేగించిన భజరంగ్ దళ్


ఉత్తరప్రదేశ్ లో నిన్న జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపేలానే ఉంది. ముగ్గురు హిందువులను క్రైస్తవులుగా మార్చిన ఓ వ్యక్తిని పట్టుకుని బజారుకీడ్చిన భజరంగ్ దళ్ కార్యకర్తలు అతడికి గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. పట్టపగలు, నడి వీధుల్లో ఈ ఊరేగింపు జరుగుతున్నా, అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన ఒక్క పోలీసూ లేకపోవడం గమనార్హం. వివరాల్లోకెళితే... యూపీలోని జలావున్ జిల్లా రాందర్ కు చెందిన అవదేశ్ సవిత అనే వ్యక్తి ఇటీవల ఓ ముగ్గురు హిందువులను క్రైస్తవ మతంలోకి చేర్పించారు. అంతేకాక గోమాంసాన్ని వారితో బలవంతంగా తినిపించాడట. దీనిపై సమాచారం తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు భగ్గుమన్నారు. దాదాపు 200 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు రాందార్ కు వెళ్లి సవితను అతడి ఇంటి నుంచి బయటకు లాక్కుని వచ్చారు. జిల్లాలోని ఒరాయ్ పట్టణానికి తీసుకొచ్చారు. అక్కడ సవితకు గుండు గీశారు. మీసాలు, కనుబొమలను నున్నగా కొరిగేశారు. ఆ తర్వాత మెడలో చెప్పుల దండ వేశారు. పట్టణంలో ఊరేగించారు. ఊరేగింపు జరుగుతున్నంత సేపు ఆ దిశగా ఒక్క పోలీసూ రాలేదు. ఊరేగింపు తర్వాత బాధితుడి తరఫున ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటిదాకా ఒక్క అరెస్ట్ కూడా జరగకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News