: తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందున్న భయాందోళనలు ఈరోజు లేవు: లక్ష్మీపార్వతి


తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందున్న భయాందోళనలు ఈరోజు లేవని.. అందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఒక ఛానెల్ లో మంత్రి కేటీఆర్ లైవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్, వీఐపీ కల్చర్ తదితర అంశాలపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘లక్ష్మీపార్వతి గారు చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం. హైదరాబాద్ లోని చాలామంది అభిప్రాయం కూడా ఇదే. గతంలో చాలామంది పెద్దలు కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. వాళ్లందరూ ఈ రోజు మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబు ఇస్తున్నారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాం. దానిలోని మురుగు నీటిని తోడేసి శుద్ధి చేసిన మంచినీటితో నింపాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. హుస్సేన్ సాగర్ గతంలో ఏ విధంగానైతే మంచినీటి సరస్సుగా ఉండేదో.. అలా చేసి, పూర్వవైభవాన్ని తీసుకువస్తాము. కేవలం హుస్సేన్ సాగరే కాకుండా మూసీ నదికి కూడా పూర్వవైభవం తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వీఐపీ కల్చర్ గురించి.. నా పరిధిలో నేను నియంత్రించుకున్నాను. ఎక్కడా కూడా బ్లూలైట్ వాహనం వాడటం కానీ, ప్రభుత్వ క్వార్టర్స్ తీసుకోవడం కానీ నేను చేయలేదు. దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News