: ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులకు ధన్యవాదాలు: ధోనీ
ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులందరికీ ధన్యవాదాలని టీమిండియా కెప్టెన్ ధోనీ తెలిపాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో రెండో టీట్వంటీలో విజయం సాధించిన అనంతరం ధోనీ మాట్లాడుతూ, ఇక్కడి అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాల్లో ఆడే సమయంలో భారత జట్టుకు విదేశాల్లో ఆడుతున్న ఫీలింగ్ రాదని, సొంత దేశంలో ఆడుతున్న భావన ఉంటుందని అన్నాడు. ఫీల్డింగ్ తప్పిదాలు నిరాశకు గురి చేసినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో విజయం సిద్ధించిందని ధోనీ చెప్పాడు. విజయం ఆనందాన్ని ఇస్తుందని, తాను కూడా జట్టు ప్రదర్శన గాడిన పడడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ధావన్, రోహిత్, కోహ్లీ నిలదొక్కుకుంటే విధ్వంసమేనని చెప్పిన ధోనీ, ఆ ముగ్గురూ రాణించడం వల్ల సునాయాసంగా గెలుపొందామని చెప్పాడు. పాండ్య పరుగులిచ్చినా కీలక సమయంలో వికెట్ తీశాడని అన్నాడు. జడేజా పట్టిన వాట్సన్ క్యాచ్ అద్భుతమని ధోనీ తెలిపాడు. ఫించ్ బాగా ఆడాడని ధోనీ కితాబునిచ్చాడు. మూడో టీట్వంటీలో కూడా విజయం సాధించాలని ధోనీ కాంక్షించాడు.