: హైదరాబాదు అంటే చార్మినార్, బుద్ధ ప్రతిమ, హైటెక్ సిటీ...వీటిలో ఏది ఎవరు కట్టారు?: చంద్రబాబు
హైదరాబాదు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి చార్మినార్, హుస్సేన్ సాగర్ లో భారీ బుద్ధ ప్రతిమ, హైటెక్ సిటీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మూడింటిలో చార్మినార్ ను నిజాం కట్టిస్తే, బుద్ధ ప్రతిమను ప్రతిష్ఠించినది ఎన్టీఆర్ అని చెప్పారు. ఇక అందరికీ తెలిసిందే... హైటెక్ సిటీని కట్టించింది తానేనని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బేగంపేటలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ హైదరాబాదీలకు ఏం చేసిందో చెప్పమని నిలదీయాలని సూచించారు. హైదరాబాదులో మొట్టమొదటిసారి రాత్రిపూట రోడ్లు క్లీన్ చేసే విధానాన్ని తానే అమలులోకి తీసుకొచ్చానని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వినూత్న విధానాలు ఏం చేపట్టారో టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీతి నిజాయతీలతో పనిచేసే ప్రజా ప్రతినిధులను గెలిపించాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలను గెలిపిస్తే, వారితో పనిచేయించే బాధ్యత తనదేనని ఆయన వివరించారు.