: ఆసీస్ గడ్డపై ఆసీస్ ను ఓడించిన భారత్...సిరీస్ మనదే
ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ ను భారత జట్టు ఓడించింది. టీట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్ ల టీట్వంటీ సిరీస్ లో భారత జట్టు తిరుగులేని విధంగా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ధావన్ (42), రోహిత్ శర్మ (60) శుభారంభాన్నిచ్చారు. అనంతరం వచ్చిన కోహ్లీ (59) మరింత ధాటిగా ఆడడంతో ధోనీ (14) సహకారంతో జట్టు మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (74) షాన్ మార్ష్ (23) వీరవిహారం చేశారు. టీమిండియా పేసర్లకు చుక్కలు చూపించారు. ఈ దశలో ఆసీస్ విజయం సులువేననిపించారు. ఈ దశలో స్పిన్నర్లను రంగంలోకి దించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మార్ష్ ను అశ్విన్ పెవిలియన్ బాటపట్టించడంతో ఆసీస్ పతనం మొదలైంది. లిన్ (2), మ్యాక్స్ వెల్ (1), షేన్ వాట్సన్ (15), జేమ్స్ ఫాల్కనర్ (10), జాన్ హేస్టింగ్స్ (4), టై (4) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. మథ్యూ వేడ్ () నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా రెండు, అశ్విన్, పాండ్య, బుమ్రా చెరో వికెట్ తీసి రాణించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ గెలుచుకుంది. దీంతో ఆసీస్ లో టీట్వంటీ మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు.