: ఉధంపూర్ దాడికి 2 నెలల ముందే దేశంలోకి ఉగ్రవాదులు... ఆశ్రయమిచ్చిన స్థానికులు
దేశంలో పెను బీభత్సం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు ఇంటి దొంగల నుంచి సహకారం బాగానే అందుతోంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలోనూ ఇంటి దొంగల కోణం వెలుగుచూసినా, ఇంకా పూర్తిగా ఆధారాలు లభించలేదు. గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులకు ఇంటి దొంగల నుంచి సహకారం లభించిన వైనంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆధారాలు సంపాదించారు. 2015, ఆగస్టు 5న ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిగితే, అంతకు రెండు నెలల ముందే నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటుకుని భారత్ లోకి ప్రవేశించారు. మరి రెండు నెలల పాటు వీరు ఎక్కడున్నారు, ఏం చేశారు? అన్న కోణాల్లో దర్యాప్తు సాగించిన ఎన్ఐఏ అధికారులు... ఉధంపూర్ పరిసరాల్లోని స్థానికులే ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్లు తేలింది. ఈ మేరకు దీనికి సంబంధించి పక్కా సమాచారం సేకరించిన ఎన్ఐఏ నిన్న తన నివేదకను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అందజేసింది. ఈ తరహా ఇంటి దొంగల సహకారానికి చెక్ పెట్టేందుకు కాస్తంత కఠిన చర్యలు తీసుకోక తప్పదని కూడా ఎన్ఐఏ అధికారులు ఆ నివేదికలో సర్కారుకు సూచించారు.