: విద్యార్థులతో చర్చలకొచ్చిన ‘సెంట్రల్’ శ్రీవాస్తవ... వీసీ గోబ్యాక్ అంటూ స్టూడెంట్స్ నినాదాలు
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో వేడి ఇంకా చల్లారలేదు. తరగతుల పునరుద్ధరణపై నిన్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. సెమిస్టర్ నష్టపోకుండా ఉండాలంటే తక్షణమే తరగతులకు హాజరు కావాల్సిందేనని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేయగా, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా క్లాసుల నిర్వహణ ప్రసక్తే లేదని అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫు విద్యార్థులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఏఎస్ఏ విద్యార్థులు తరగతులను అడ్డుకునేందుకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. వీరితో చర్చలకు ఇన్ చార్జీ వీసీ విపిన్ శ్రీవాస్తవ యత్నించారు. ఈ క్రమంలో తమ వద్దకు వచ్చిన వీసీని గోబ్యాక్ అంటూ విద్యార్థులు నినదించారు. దీంతో మరోమారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.