: తెలంగాణలో తలదాచుకున్న ‘కాల్ మనీ’ నిందితులు... పాలమూరు జిల్లాలో గుంటూరు పోలీసుల సోదాలు
ఏపీలో జనాన్ని జలగల్లా పీడిస్తున్న కాల్ మనీ వ్యాపారులపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. లెక్కకు మిక్కిలి కేసులు నమోదు చేసి, దొరికినవారినందరినీ కటకటాల వెనక్కు నెట్టింది. ఇటు బెయిల్ మంజూరు కాగానే, అటు కొత్త కేసు నమోదు చేసి వారికి ఊపిరాడనివ్వలేదు. దీంతో బెంబేలెత్తిపోయిన కాల్ మనీ కేటుగాళ్లు పలాయనం చిత్తగించారు. ట్రాన్స్ కో డీఈ సత్యానందం లాంటి వాళ్లు సింగపూర్ వెళ్లగా, అంత స్తోమత లేని వాళ్లు పొరుగు రాష్ట్రాల్లో తల దాచుకున్నారు. విషయాన్ని పసిగట్టిన గుంటూరు జిల్లా పోలీసులు పొరుగు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా ఆ జిల్లా పోలీసులు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో నేటి ఉదయం విస్తృతంగా దాడులు చేశారు. ఈ క్రమంలో జడ్చర్ల మండలంలో ఓ కాల్ మనీ కేటుగాడిని పట్టేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మిడ్జిల్ మండలంలోనూ ముమ్మర సోదాలు చేస్తున్నారు.