: టెన్నిస్ గ్రౌండ్ లో ప్రేక్షకులుగా టీమిండియా క్రికెటర్లు... జోకోవిచ్ మ్యాచ్ ను ఆస్వాదించిన వైనం
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయినా, ‘పొట్టి’ ఫార్మాట్ లో భాగంగా మొన్నటి టీ20 మ్యాచ్ లో ఆసీస్ జట్టును మట్టి కరిపించి సత్తా చాటింది. ఈ మ్యాచ్ విజయంతో తామంతా దాదాపుగా రీచార్జి అయినట్టేనని కూడా ధోనీ సేన చెప్పకనే చెప్పింది. నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మొన్ననే టీమిండియా ఆటగాళ్లంతా మెల్ బోర్న్ చేరుకున్నారు. ఇదిలా ఉంచితే, నిన్న మెల్ బోర్న్ లో ఆస్ట్రేయన్ ఓపెన్ లో భాగంగా టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, నోవాక్ జొకోవిచ్ ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పై అత్యంత ఆసక్తి కనబరిచిన టీమిండియా ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. నేరుగా స్టేడియానికి వెళ్లి ప్రేక్షకుల స్టాండ్స్ లో కూర్చుని ఆ టెన్నిస్ దిగ్గజాల ఆటను కన్నార్పకుండా తిలకించారు. మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ తో కలిసి సెల్ఫీ తీసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సదరు ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం వ్యాఖ్యాతగా మారిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా టెన్నిస్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించడమే కాక ఫలితంపై ట్వీట్ చేశాడు.