: దేశానికే గర్వకారణంగా ఉండేలా జర్నలిస్టు కాలనీ నిర్మిస్తాం!: కేసీఆర్
తెలంగాణలో జర్నలిస్టులకు ఇచ్చే ఇళ్లు విశాలంగా ఉంటే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జర్నలిస్టులకు అపార్టుమెంట్లలో ఫ్లాట్లు ఇస్తారా? లేక ఇళ్ల స్థలాలు కేటాయిస్తారా? అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ, ‘జర్నలిస్టులకు కట్టించి ఇచ్చే ఇళ్లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కన్నా మరింత వెడల్పుగా.. కిచెన్ ని కొంచెం పెద్దది చేసి కట్టాలని అనుకున్నాం. అయితే, జర్నలిస్టులు కూడా కొంత డబ్బును కలపాల్సి ఉంటుంది. 750 లేదా 800 చదరపు అడుగులతో కనుక ఇంటిని నిర్మించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. నా ఉద్దేశ్యంలో జర్నలిస్టులంతా సమానమే. జర్నలిస్టు సంఘాలు ఉంటే ఉండవచ్చు. దాంతో మాకు పనిలేదు. ప్రతి జర్నలిస్టుకు ఈ సౌకర్యం రావాలి. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ లోని ప్రతి జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు ఈ సౌకర్యం అంది తీరాల్సిందే. ఒక కామన్ కమిటీ వేస్తే సాధ్యమైనంత తొందరగా జర్నలిస్టు కాలనీ నిర్మిస్తాం.. దేశానికే గర్వకారణంగా ఉండేలా ఈ కాలనీ ఉండాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.