: సరికొత్త రికార్డు దిశగా ఖతార్ ఎయిర్ వేస్
సరికొత్త రికార్డు దిశగా ఖతార్ ఎయిర్ వేస్ అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే లాంగెస్ట్ జర్నీ నిర్వహించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సన్నాహాలు చేసుకుంటోంది. ఖతార్ రాజధాని దోహా నుంచి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కి విమాన సర్వీసు నడపనుంది. ఇది దోహాలో బయల్దేరి నేరుగా ఆక్లాండ్ చేరుకుంటుంది. ఈ రెండు పట్టణాల మధ్యనున్న 9,034 మైళ్ల దూరాన్ని అధిగమించేందుకు ఆ విమానానికి 18 గంటల 34 నిమిషాల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. ఇంతవరకు అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి 8,578 మైళ్ల దూరాన్ని 16 గంటల 55 నిమిషాల్లో అధిగమిస్తున్న విమానం సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న విమానంగా రికార్డు పుటల్లో నిలిచింది. మరికొద్ది రోజుల్లో దీనిని అధిగమించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సన్నాహాలు ప్రారంభించింది. తద్వారా ఖతార్ ఎయిర్ వేస్ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది.