: గతంలో కన్వర్టర్లు, ఇన్వర్టర్లు ఉండేవి ...ఆ అన్ని సమస్యలని మేం పరిష్కరించాం!: కేసీఆర్


జంటనగరాల్లో కన్వర్లర్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు ఉండేవని, ఇప్పుడు వాటిని లేకుండా చేశామని ఆయన కేసీఆర్ అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ లు గతంలో శుభ్రమైన నీరు కూడా అందజేయలేదని ఆయన చెప్పారు. మంచి కుంటలను మురికి కూపాలుగా మార్చిన ఘనత ఎవరిది? మూసీ నది, హుస్సేన్ సాగర్ లను కాలుష్య కాసారాలుగా మర్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, నాలాల దురాక్రమణలు, కబ్జాలు చేసింది ఈ పార్టీల నేతలు కాదా? అని ఆయన నిలదీశారు. పరిణతి చెందిన ఓటర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇప్పుడవే పార్టీలు ఓటేయండి, అద్భుతాలు చేస్తామని చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. 1400 చెరువులు, కుంటలు ఉన్న హైదరాబాదులో కేవలం 150 వరకు మాత్రమే మిగిలాయంటే వాటిని ఎవరు మాయం చేశారో ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన ఆయన, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఆత్మవిశ్వాసంతో పాటు, చిత్తశుద్ధి ఉంటే సాధించి తీరుతామని ఆయన చెప్పారు. స్వచ్ఛ హైదరాబాదు చేపట్టి, నగరాన్ని 400 భాగాలు చేసి, ప్రతి ప్రాంతం శుభ్రమయ్యే విధంగా తయారు చేసిన ఘనత టీఆర్ఎస్ దేనని ఆయన చెప్పారు. 46 లక్షల డస్ట్ బిన్స్ కొని ప్రతి ఇంటికీ పంచామని ఆయన తెలిపారు. హైదరాబాదులో 200 మార్కెట్లు నిర్మించే చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. హైదరాబాదులో సుమారు 500 పబ్లిక్ టాయిలెట్స్ ఉండాల్సి ఉండగా, 200 మాత్రమే ఉన్నాయని, వాటిల్లో కొన్ని నిరుపయోగంగా మారాయని ఆయన చెప్పారు. 250 పబ్లిక్ టాయ్ లెట్స్ కడుతున్నామని ఆయన చెప్పారు. శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. హైదరాబాదుకు నాలుగు వైపులా నాలుగు డంపింగ్ యార్డులు ఉండాలని, చెత్తతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఆసుపత్రులకు వచ్చేవారికి నైట్ షెడ్లు కట్టించాలని భావిస్తున్నామని, బస్తీ వాసులు శుభకార్యాలు జరుపుకునేందుకు 56 ఫంక్షన్ హాళ్లు కట్టాలని ఆదేశించామని ఆయన చెప్పారు. 45 లక్షల మంది ప్రజలు బస్సుల్లో ప్రయాణించే నగరంలో బస్ బేలు నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. మరో నాలుగు బస్ టెర్మినల్స్ ను ఔటర్ రింగ్ రోడ్డు బయట నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీ తరహాలో హైదరాబాదుకు తూర్పు, పడమర దిక్కుల్లో రెండు రైల్వే స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. అలాగే శంషాబాదు ఎయిర్ పోర్టులో రెండో రన్ వే నిర్మించాలని జీఎంఆర్ సంస్థను కోరామని ఆయన చెప్పారు. భారత దేశంలో ఏ నగరానికి లేని హంగులు కేవలం హైదరాబాదుకు మాత్రమే ఉన్నాయని చెప్పిన ఆయన, 46 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News