: ‘స్మార్ట్’ హోదా దక్కేదెవరికో?... నేడు తొలి విడత 20 ‘స్మార్ట్’ నగరాలను ప్రకటించనున్న కేంద్రం
నరేంద్ర మోదీ సర్కారు ఏడాదిన్నరగా ఊరిస్తున్న ‘స్మార్ట్ సిటీ’ హోదా ఏఏ నగరాలకు దక్కనుందన్న విషయం మరికాసేపట్లో తేలిపోనుంది. దేశంలోని వంద నగరాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ‘స్మార్ట్ సిటీ’ల పథకాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద ఎంపికయ్యే నగరాలు కేంద్రం అందించే నిధులతో సర్వతోముఖాభివృద్ధి చెందనున్నాయి. స్మార్ట్ సిటీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక రవాణా సౌకర్యం, ఈ- గవర్నెన్స్, ఐటీ కనెక్టివిటీ తదితరాలు సమకూరనున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి అందిన లేఖలకు స్పందించిన రాష్ట్రాలు మొత్తం 97 నగరాలను స్మార్ట్ సిటీ పథకానికి ప్రతిపాదించాయి. ఈ పథకంలో భాగంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేయనున్న కేంద్రం, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. జాబితాలోని మిగిలిన నగరాలను తర్వాతి దశల్లో అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నగరాలను అన్ని రకాలుగా పరిశీలించిన అత్యున్నత స్థాయి కమిటీ తొలి విడత నగరాలను ప్రకటించనుంది. ఈ జాబితా కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ఆయా నగరాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.