: వచ్చే నెలలోనే సఫాతో నా పెళ్లి... ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్
భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటి వాడు కానున్నాడు. అరంగేట్రంతో బౌలర్ గా అదరగొట్టిన ఇర్ఫాన్... ఆ తర్వాత ఆల్ రౌండర్ గానూ రాణించాడు. తదనంతర కాలంలో ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొన్న అతడు దాదాపుగా కనుమరుగయ్యాడు. ఐపీఎల్ లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్న ఇర్ఫాన్, జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన అమ్మాయితో ఇర్ఫాన్ ప్రేమలో పడ్డాడని వదంతులు వినిపించాయి. అయితే తాజాగా పెద్దలు కుదిర్చిన పెళ్లికే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సఫా అనే అమ్మాయితో తన పెళ్లి వచ్చే నెలలో జరగనుందని అతడు ప్రకటించాడు. ‘‘ఫిబ్రవరిలో నా పెళ్లి సఫాతో జరగనున్న మాట వాస్తవం. ఇతర వివరాలన్నీ త్వరలో చెబుతాను’’ అని అతడు నిన్న బరోడాలో పేర్కొన్నాడు. ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో ఇర్ఫాన్ పెళ్లి ఉంటుందని, అందుకనుగుణంగా ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయని అతడి సన్నిహితులు చెబుతున్నారు.