: ‘అమ్మ’ మిక్సీలు ‘ఆంధ్రా‘లో అమ్మకానికి!
తమిళనాట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తాను అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జయలలిత పేద ప్రజలకు ‘అమ్మ’ మిక్సీలు, గ్రైండర్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడివి సరిహద్దులు దాటాయి. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రోడ్డు పక్కన వాటిని విక్రయిస్తున్నారు. అమ్మ’ మిక్సీ రూ.500లకు, గ్రైండర్ రూ. 1600 కు అమ్ముతున్నారు. తక్కువ ధరలకే ఈ వస్తువులు విక్రయిస్తుండటంతో ప్రజలు ఎగబడి మరీ, కొనుగోలు చేస్తున్నారు. వాటి ధరలు డిమాండ్-సప్లై ఆధారంగా మారుతూ ఉంటాయి. రూ.3000 నుంచి రూ.10,000 వరకు గ్రైండర్లను అక్కడ విక్రయిస్తున్నారు. ఒక్కోసారి ఇవే గ్రైండర్లను రూ.1600 కూడా అమ్ముతున్నారు. ‘అమ్మ’ అంత ప్రేమగా ఇచ్చిన మిక్సీలు, గ్రైండర్లను చాలా మంది తమిళ ప్రజలు అమ్మేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలకు చెందిన వారు అక్కడికి వెళ్లి ఆయా వ్యక్తుల నుంచి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత, వాటిని నెల్లూరు, ప్రకాశం జిల్లాల మార్కెట్లలో లాభానికి అమ్ముకుంటున్నారు. ఈ సందర్భంగా ‘అమ్మ’ మిక్సీలు, గ్రైండర్లు అమ్ముతున్న వ్యాపారులు మాట్లాడుతూ, తమిళనాడు నుంచి వాటిని తెచ్చుకోవడానికి రెండు లేదా మూడు రోజులు పడుతుందని చెప్పారు. పది రోజులకొకసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాటిని విక్రయిస్తామని, ఒక్కొక్క మిక్సీపై సుమారు రూ. 300 లాభం వేసుకుని వాటిని అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు.