: ఏపీ బడ్జెట్ సమావేశాలు హైదరాబాదులోనే!
ఏపీ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్ లోనే నిర్వహించే అవకాశమున్నట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మార్చి5న రాష్ట్ర బడ్జెట్, 8న వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటారని చెప్పారు. అంతకుముందు, ఏపీ ఎన్జీవోల 19వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆయన ఈరోజు విడుదల చేశారు. కాగా, రాష్ట్రంలో మండలాల సంఖ్యను పెంచాలని, వీడియో కాన్ఫరెన్స్ లకు క్యాలెండర్ విధానం రూపొందించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ల వల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన అన్నారు.