: ప్రభుత్వాల పెద్దలను చొక్కా పట్టుకుని నిలదీయండి: ‘యువభేరీ’లో వైఎస్ జగన్
'ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను చొక్కా పట్టుకుని నిలదీయండి' అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. ఈరోజు కాకినాడలో వైఎస్సార్సీపీ నిర్వహించిన యువభేరీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ కు ముందు జగన్ ప్రసంగించారు. ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా? అని ఏపీ సర్కార్ దిక్కుమాలిన ఆలోచన చేస్తోందని, ఆరోగ్య మిత్ర ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆయన అన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. పీహెచ్ డీలు చేసిన వారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రత్యేక హోదాతో గ్రాంట్లు ఎక్కువగా వస్తాయని, పరిశ్రమలకు వంద శాతం రాయితీ రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని అన్నారు. పరిశ్రమల కోసం చంద్రబాబు సింగపూర్, మలేషియా, దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తెస్తే సరిపోతుందని అన్నారు. ప్రత్యేక హోదాతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు అన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయని, పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ‘యువభేరీ’లో పాల్గొనేందుకు వచ్చిన యువతకు జగన్ ధన్యావాదాలు తెలిపారు.