: ఐఫోన్ అమ్మకాల తగ్గుదలతో పడిపోయిన యాపిల్ రెవెన్యూ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఇందుకు ప్రధాన కారణం సంస్థకు చెందిన ఐఫోన్ అమ్మకాలు పోయిన ఏడాది తగ్గాయని, దాంతో 13 ఏళ్లలో తొలిసారి తమ రెవెన్యూ తగ్గిందని యాపిల్ తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనం కారణంగానే ఐఫోన్ ఎగుమతులు తగ్గాయని పేర్కొంది. 2007లో ఐఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదటిసారిగా అమ్మకాల రేటు పడిపోయిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 74.8 మిలియన్ల ఐఫోన్ లను విక్రయించామని, అయితే గతేడాది ఇదే కాలంతో పోల్చితే ప్రస్తుత త్రైమాసికంలో కూడా ఫోన్ల అమ్మకాల వృద్ధి ఆశించినంతగా ఉండకపోవచ్చని వివరించింది. అన్నట్టు యాపిల్ కంపెనీ మొత్తం రెవెన్యూలో ఐఫోన్ వాటా 68 శాతంగా ఉంది.