: యువరాజ్ ను పక్కనబెట్టి నేనే ఎందుకు వచ్చానంటే..: ధోనీ
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ-20లో భారత జట్టు విజయం సాధించిందన్న ఆనందం మధ్యే, జట్టులోకి తిరిగి వచ్చిన యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ను మరోసారి తిలకించలేకపోయామని క్రికెట్ అభిమానులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన వేళ, కెప్టెన్ ధోనీ నోరు విప్పాడు. వాస్తవానికి రెండు వికెట్లు పడ్డ తరువాత, యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండగా, యువీని ఆపిన ధోనీ బ్యాటు చేతబట్టి మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. కేవలం 3 బంతులను మాత్రమే ఎదుర్కొన్న ధోనీ, విలువైన 11 పరుగులు జోడించాడు కూడా. ఇండియా నుంచి వచ్చి జట్టులో చేరిన యువరాజ్, కేవలం ఒక్క నెట్ సెషన్ ప్రాక్టీసులో మాత్రమే పాల్గొన్నాడని, ఆ కారణంగానే యువీ కన్నా ముందు రైనాను, ఆపై తాను రావాల్సి వచ్చిందని ధోనీ చెప్పాడు. రైనా బాగా బ్యాటింగ్ చేశాడని గుర్తు చేస్తూ, యువరాజ్ మంచి ఆటగాడని, ఓ అద్భుత క్యాచ్ పట్టుకుని క్రిస్ లెన్ ను పెవీలియన్ దారి పట్టించాడని అన్నాడు. తదుపరి మ్యాచ్ లలో యూవీ విన్యాసాలు తిలకించే అవకాశం లభిస్తుందనే అనుకుంటున్నట్టు చెప్పాడు.