: స్వాతంత్ర్యం రావడానికి కారణం గాంధీ కాదు, నేతాజీయే... స్పష్టం చేస్తున్న అప్పటి బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ కామెంట్!
మహాత్మా గాంధీ చేసిన అహింసాయుత పోరాటం ఫలితంగానే భరతమాత తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తిని పొందిందని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వున్నాం. కానీ, వాస్తవానికి గాంధీని చూసి కాదట, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణంగానే ఇండియాను విడిచి వెళ్లాల్సి వచ్చిందట. అత్యంత సంచలనమైన ఈ విషయాన్ని అప్పటి బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రచురితం కానున్న "బోస్: యాన్ ఇండియన్ సామురాయ్" పుస్తకంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఉన్నట్టు చెబుతున్నారు. బ్రిటన్ ప్రధానిపై గాంధీ అహింసా ఉద్యమం నామమాత్రపు ప్రభావాన్నే చూపిందని, నేతాజీ మొదలు పెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ మాత్రం వారిని భయపెట్టిందని పుస్తకాన్ని రచిస్తున్న సైనిక చరిత్రకారుడు జనరల్ జీడీ బక్షి వెల్లడించారు. స్వాతంత్ర్యానంతరం 9 ఏళ్ల తరువాత పశ్చిమ బెంగాల్ కు వచ్చిన అట్లీ, జస్టిస్ పీబీ చక్రవర్తి ఇంట బస చేశారని చెబుతూ, ఆ సమయంలో వారి మాటలను పుస్తకంలో వివరించినట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇండియాను వదిలి ఎందుకు వెళ్లారన్న చక్రవర్తి ప్రశ్నపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం తరువాత పరిస్థితి మారుతోందని తాము గమనించామని, ఆపై నేతాజీ సైనిక కార్యకలాపాలు చూసి ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించినట్టు పేర్కొన్నారు.