: 26 రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ. 7.9 లక్షల కోట్ల నష్టం!
భారీ ఎత్తున అమ్మకాల ఒత్తిడి రాగా, ఈ నెలలో ఇంతవరకూ పెట్టుబడిదారులకు చెందిన రూ. 7.9 లక్షల కోట్ల పెట్టుబడి మార్కెట్ పతనం కారణంగా హారతి కర్పూరమైంది. ఈ 26 రోజుల వ్యవధిలో సెన్సెక్స్ సూచిక 1,631 పాయింట్లు పడిపోయి 6.24 శాతం నష్టంతో 24,485 పాయింట్లకు చేరింది. జనవరి 20న 23,839 పాయింట్లకు పడిపోయి 52 వారాల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్, ఆపై కాస్తంత రికవరీ అయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాలకు తోడు, ముడిచమురు ధరల పతనం ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 31వ తేదీన రూ. 1,00,37,734 లక్షల కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ సోమవారం నాటి సెషన్ ముగిసే సమయానికి రూ. 7,96,903 కోట్లు నష్టపోయి రూ. 92,40,831 కోట్లకు చేరింది. చైనాలో మాంద్యం కూడా ఇన్వెస్టర్లను, ముఖ్యంగా ఎఫ్ఐఐలను మార్కెట్ కు దూరంగా ఉంచిందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. భారత ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 9,900 కోట్ల విలువైన వాటాలు అమ్మకానికి వచ్చాయని, దీని కారణంగానే భారీ నష్టం చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. కాగా, 2014లో 30 శాతం పెరిగిన సెన్సెక్స్ 2015లో 5 శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే.