: తండ్రి బయట మంచును తొలగిస్తుంటే... కారులో మరణించిన భార్య, బిడ్డ!


అమెరికాను ముంచెత్తిన మంచు తుపాను అభంశుభం ఎరుగని ఓ చిన్నారిని బలిగొంది. న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తన బిడ్డను కారులో వెచ్చగా ఉంచాలన్న ఓ తండ్రి తపన భార్యాబిడ్డల ప్రాణాలనే బలిగొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తన బిడ్డతో కలసి కారులో వస్తూ, మంచులో కూరుకుపోయిన కారును వెలికితీసేందుకు ఫెలిక్స్ బొనిల్లా అనే వ్యక్తి కారు దిగి డోర్లు మూసి మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపటి తరువాత మంచును తొలగించిన ఆయన, కారులో చూడగా, ఒక సంవత్సరం వయసున్న చిన్నారితో పాటు తన సతీమణి అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి బావురుమన్నాడు. ఇరుగు, పొరుగు సహాయపడి వైద్య చికిత్స నిమిత్తం 911కు ఫోన్ చేయగా, వచ్చిన సహాయక సిబ్బంది వారి నాడి అందడం లేదని చెప్పడంతో, అక్కడున్న పోలీసు సిబ్బంది, ప్రజలు బోరున విలపించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మరణించిన వారు ఫెలిక్స్ సతీమణి, 23 ఏళ్ల రోసా, వారి బిడ్డ మెసయ్య అని వెల్లడించిన అధికారులు, కారులో 'సైలెంట్ కిల్లర్'గా పేరున్న కార్బన్ మోనాక్సైడ్ ఉండటమే కారణమని తెలిపారు. వారు పీలుస్తున్న గాలి క్రమంగా వారి ప్రాణాలను హరించిందని, తెలియకుండానే వారు మృత్యువుకు దగ్గరయ్యారని వెల్లడించారు. ఇదో హృదయ విదారక ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News