: ప్రణబ్, హోలాండ్, మోదీని చూడగానే తలలు తిప్పి సెల్యూట్ చేసిన శునకాలు!
ఈ ఉదయం న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విన్యాసాలు, శకటాలు అందరినీ ఆకర్షించినా, ప్రతి ఒక్కరూ మరచిపోలేనిది ఒకటే ఒకటి. అదే భారత శునక దళం చేసిన విన్యాసం! తొలిసారిగా పెరేడ్ లో పాల్గొన్న ఇండియన్ డాగ్ స్క్వాడ్ రాజ్ పథ్ లో తమ ట్రైనర్ లతో నడిచి వస్తున్న వేళ, హాజరైన ఆహూతులంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ఇండియా గేట్ నుంచి వచ్చిన శునకాల దళం, సరిగ్గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విశిష్ట అతిథి హోలాండే, ప్రధాని నరేంద్ర మోదీ ఆసీనులైన వేదిక వద్దకు రాగానే, మిగతా అన్ని రెజిమెంట్లు, కమాండెంట్ల ప్రతినిధులు తిప్పినట్టుగా తమ తలలను వేదికపై ఉన్న అతిథుల వైపు తిప్పి సెల్యూట్ చేశాయి. వేదికను దాటి వెళ్లే వరకూ ఒక్క శునకరాజం కూడా తలను మరో వైపు తిప్పలేదు. ఈ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే హోలాండే, మోదీ మధ్య కొంత సంభాషణ కూడా సాగింది.