: రోహిత్ వేముల సస్పెన్షన్ పై కేంద్రం నుంచి ఒత్తిడేమీ లేదు: హెచ్ సీయూ కొత్త వీసీ
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో... ఓ వైపు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీగా ఉన్న పొదిలే అప్పారావు నిరవధిక సెలవులో వెళ్లారు. అప్పారావు స్థానంలో వర్సిటీ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ ఇన్ చార్జీ వీసీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన విపిన్ ను వీసీగా అంగీకరించబోమని విద్యార్థి జేఏసీ తేల్చిచెప్పింది. విద్యార్థి జేఏసీ అభ్యంతరాలను లెక్కచేయని విపిన్ ఆదివారమే ఇన్ చార్జీ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు రెండు రోజుల తర్వాత వెలుగుచూశాయి. రోహిత్ వేముల సహా ఐదుగురు విద్యార్ధుల సస్పెన్షన్ కు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి రాలేదని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ తో రోహిత్ తదితరులకు నెలకొన్న వివాదంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయడం, ఆ తర్వాత వర్సిటీ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ సదరు శాఖ ఏకంగా ఐదు లేఖలు రాసిందన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ తదితరులపై చర్యల కోసం ఏర్పాటు చేసిన కమిటీకి విపిన్ శ్రీవాస్తవనే నేతృత్వం వహించారు. విచారణ సందర్భంగా అసలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి లేఖలు వచ్చిన విషయాన్నే అప్పారావు తమకు చెప్పలేదని విపిన్ పేర్కొన్నారు.