: తమిళనాట 'తెలుగు' విజయం!


తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలకు ఊరట లభించింది. రాష్ట్రంలో ఉంటున్న ఎవరైనా తమిళం నేర్చుకోవాల్సిందేనంటూ జయలలిత సర్కారు తెచ్చిన నిర్బంధ తమిళంపై పోరాడిన తెలుగువారు విజయం సాధించారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో తమిళ పరీక్షను తొలగించాలని కోరుతూ విద్యార్థులు వేసిన పిటిషన్ పై మద్రాసు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నిబంధనను తొలగిస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు 13 వేల మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. కాగా, ఈ తీర్పు తమిళనాడులో ఉన్న తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ తదితర 13 భాషల విద్యార్థులకు అత్యంత ఆనందకరమని ప్రజలు అంటున్నారు. దాదాపు 40 శాతం మంది విద్యార్థులపై తీర్పు ప్రభావం చూపనుందని తెలుస్తోంది. వీరంతా ఇక తమిళ భాషలో పరీక్షలు రాయకుండానే చదువులు ముగించే అవకాశం ఏర్పడనుంది. విద్యార్థులు సహా, పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీర్పిస్తూ, విద్యార్థుల విజ్ఞప్తులను మన్నించాలని ఆదేశిస్తూ, ఈ విద్యా సంవత్సరానికి ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈ మినహాయింపు ఎంతకాలమన్న విషయం జ్యుడిషియల్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News