: డొనాల్డ్ ట్రంప్ కు ప్రవాస భారతీయురాలి బహిరంగ లేఖ... సోషల్ మీడియాలో సంచలనం!
చంద్రా గంగూలీ... భారత సంతతికి చెందిన అమెరికన్. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో నివసిస్తున్నారు. ఇటీవల అమెరికాలో జరుగుతున్న వివిధ ఘటనలను ఉదహరిస్తూ, అమెరిక్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఆమె రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ లేఖ సారాంశమిది. డియర్ డొనాల్డ్ ట్రంప్ తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని మీరు చేస్తున్న ప్రచారం, అతి త్వరలో ముగిసిపోయి తిరిగి ఇంటికి చేరుకుంటారని భావిస్తున్నాను. ఇటీవల నేను ఓ ఎయిర్ పోర్టు కాఫీ షాపులో ఉన్న వేళ, మీరు ముస్లిమా? అని అడిగారు. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, నేను చామన ఛాయగా ఉంటాను కాబట్టి. ఎక్కువగా ఈ ప్రశ్న తెల్లగా ఉన్న వారి నుంచే ఎదురవుతుంది. దీనికి నేనిచ్చే సమాధానం "నేను అమెరికన్ ను" అని. ఈ సమాధానం చాలా మందికి నచ్చుతుంది. మీ వంటి వారికి మాత్రం ఇది సరైన సమాధానం అనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ముస్లింల గురించి మీరెన్నో వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం నవంబర్ లో వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ నేను చూశాను. "9/11 దాడుల అనంతరం ముస్లింలు వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేయడం చూశాను" అని మీరు వ్యాఖ్యానించారు. ఇది అవాస్తవం. డిసెంబర్ 2015లో శాన్ బెర్నార్డినో పై దాడి అనంతరం కూడా మీరు ఎన్నో వ్యాఖ్యలు ముస్లింలకు వ్యతిరేకంగా చేశారు. గత కొద్ది కాలంగా అమెరికాలో వర్ణ వివక్ష ఎంతో పెరిగిపోయింది. నా తరహా రంగున్న వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సిక్కు వ్యక్తిని ముస్లింగా అనుమానిస్తూ, కొట్టి చంపారు. ఓ తాతయ్యను నడిరోడ్డుపై పోలీసులు హింసించారు. ఎందుకు? ఆయన రంగు వేరని, ఇంగ్లీష్ మాట్లాడలేదని... అవునా? నేను అమెరికాకు వచ్చి పన్నెండేళ్లు అయింది. మొదట్లో నన్ను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. నా ఆంగ్ల భాష బాగాలేదన్నారు. విదేశీ యాసలో వేగంగా మాట్లాడుతున్నావని తిట్టిపోశారు. అప్పుడెప్పుడూ నేను మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు నాకు ప్రమాదాలు పొంచి వున్నాయని అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది. ఈ దేశంలో ఉన్న వారంతా మీకు లాగానే అమెరికన్లు అని మరచిపోతున్నారు. స్వాతంత్య్రం అందరికీ సమానమేనని గుర్తించడం లేదు. కాబట్టి, మిస్టర్ ట్రంప్ వినండి. మేము ఈ దేశానికి వలస వచ్చాం. మేమంతా ఇప్పుడు అమెరికన్లమే. ఇది మా దేశం. ఎవరూ కూడా దీన్ని కాదనలేరు. ఎంతగా వివక్ష ఎదుర్కొన్నా అమెరికన్లంతా సమానమే. మీ వివక్షా పూరిత వ్యాఖ్యలను ఇక సహించేది లేదు. కేవలం మతం, శరీర రంగు చూపిస్తూ వ్యాఖ్యలు చేయడం మానండి. వినండి మిస్టర్ ట్రంప్, 'జీ సూస్ చార్లీ హెబ్డో' (నేనూ చార్లీ హెబ్డోను)... బ్లాక్ లివ్స్ మేటర్ (నల్లజాతి వారిపై హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం)... ఇక నేనూ ముస్లింనే! - చంద్రా గంగూలీ