: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది: మోదీ
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్, ఫ్రాన్స్ మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రక్షణ రంగంలో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఇవాళ ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌర అణు ఒప్పందం చేసుకున్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటన్నారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు కాలపరీక్షను ఎదుర్కొని నిలిచాయని, రైలు ఇంజిన్ నుంచి ఉపగ్రహాల నిర్మాణం వరకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. సౌర విద్యుత్ నుంచి అణు విద్యుత్ వరకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు. పారిస్, పఠాన్ కోట్ లలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తున్నామన్న మోదీ, సురక్షితమైన భవిష్యత్తు కోసం భారత్-ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె భారత్ కు సన్నిహిత మిత్రుడని, గణతంత్ర దినోత్సవానికి మరోసారి ఆయనకు స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. భారత్- ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, ఐదోసారి ఫ్రాన్స్ నేత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారని పేర్కొన్నారు.