: వారసుల మధ్య వార్!... లోకేశ్ మాటపై కేటీఆర్ తూటా!
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నగరంలోని వీధులన్నీ డప్పుల మోతలు, కోలాటాలతో సందడిగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు తమ తురుపు ముక్కలను రంగంలోకి దించాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుల వారసులుగా రంగంలోకి దిగిన నారా లోకేశ్, కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్నటి ప్రచారంలో భాగంగా నారా లోకేశ్... హైదరాబాదు అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదు అభివృద్ధి టీడీపీ చలవేనని ప్రకటించారు. ఇందుకు ఆయన ఓ ఉదాహరణను కూడా చెప్పారు. హైదరాబాదు పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే, మూడు ఫొటోలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆ మూడు ఫొటోల్లో ఒకటి చార్ మినార్, రెండోది బుద్ధుడి విగ్రహం, మూడోది హైటెక్ సిటీ అని తెలిపారు. వీటిలో చార్ మినార్ ను మినహాయిస్తే... బుధ్దుడి విగ్రహాన్ని టీడీపీ వ్యవస్థాపకుడు, తన తాత నందమూరి తారకరామావు ఏర్పాటు చేయిస్తే, తన తండ్రి చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వినిపించిన కాసేపట్లోనే వాటికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదు అభివృద్ధి తమ వల్లే సాధ్యమైందని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ, చివరకు చార్ మినార్ కూడా తమ నిర్మాణమేనని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని దెప్పి పొడిచారు. హైదరాబాదులో కనీసం రోడ్లు లేని బస్తీలు ఇంకా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ పాపమంతా టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలదేనని ఆయన విమర్శించారు.