: దక్కన్ కెమికల్స్ లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్ కెమికల్స్ లో ఈరోజు సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయనాల గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాయకరావుపేట మండల పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తుని- పాయకరావుపేట పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజవరం, కేశవరం, గజపతి నగరం గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా, ప్యారాఫిన్ రసాయనాల వల్ల మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు.