: ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతూ రైలును పేల్చేందుకు కుట్ర!
అది ఉత్తరాఖండ్ లోని రూర్కీ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామం. ఆ ఊళ్లో 20 ఏళ్ల కుర్రాడు మహ్మద్ ఒసామాకు వారి వీధిలో మంచి పేరుంది. నిత్యమూ చదువుతూ కనిపిస్తూ, ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యే చురుకైన చదువరిగా మాత్రమే వారికి పరిచయం. అది జనవరి 19... రోజు మాదిరిగా ట్యూషన్ కు వెళ్లిన ఒసామా ఇంటికి తిరిగి రాలేదు. అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎక్కడికి వెళ్లాడో తెలియని ఒసామా తండ్రి నఫీజ్ అహ్మద్ ఆందోళనకు గురయ్యాడు. మరుసటి రోజు ఢిల్లీ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న ఒసామాను అరెస్ట్ చేశామన్నది ఫోన్ ద్వారా వచ్చిన సమాచారం. ఆ మరుసటి రోజు కొడుకును కలుసుకునేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారు. మహ్మద్ ఒసామా రైళ్లను పేల్చివేసేందుకు కుట్ర పన్నాడని, అర్ధ కుంభమేళాలో బాంబులు పేల్చేందుకూ ప్లాన్ వేశాడని పోలీసులు చెప్పిన మాట విని ఆయనకు నోట మాట రాలేదు. జైలు గదిలో ఉన్న నేలపై కూర్చున్న తన కుమారుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన కొడుకు ఉగ్రవాదంటే నమ్మలేకున్నానని అహ్మద్ విలపిస్తూ చెబుతున్నాడు. పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఒసామా నిత్యమూ తరగతులకు వచ్చేవాడని, ఎన్నడూ ఎవరితోనూ గొడవలకు దిగలేదని చెబుతున్న చామ్ లాల్ వర్శిటీ డైరెక్టర్ ఆర్ కే శర్మ, అతని మనసును ఎప్పుడు, ఎవరు, ఎలా మార్చారో తెలియడం లేదని అన్నారు. ఆ ఊరిలో వారు సైతం ఈ వార్తను నమ్మడం లేదు. ఇలాగే ఎంతో మంది ఉగ్రవాదం వైపు ఆకర్షితులై చాపకింద నీరులా ప్రవర్తిస్తూ, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారని భావిస్తున్న భద్రతా దళాలు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో అనుమానితులను అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.