: విశ్వాసానికి మారు పేరు...యజమాని కోసం ఏడు నెలలు వేచి చూసిన కుక్క!


కుక్కంటేనే విశ్వాసానికి మారు పేరు. కానీ ఓ కుక్క విశ్వాసం అనే పదానికి కొత్త భాష్యం చెప్పింది. థాయ్ లాండ్ లోని పుకిట్ ప్రాంతలో కారులో యజమానితో ప్రయాణిస్తున్న బిగ్ బ్లూ (కుక్క) ఉన్నట్టుండి అందులోంచి దూకేసింది. దీనిని గమనించని యజమాని ఇంటికెళ్లిపోయాడు. తరువాత అది కనిపించకపోవడంతో వెతుకులాట ప్రారంభించాడు. అయినా దొరకలేదు. దీంతో నిరాశచెంది దాని గురించి వదిలేశాడు. బిగ్ బ్లూ మాత్రం అలా వదల్లేదు. ఎక్కడైతే యజమాని కారులోంచి దూకేసిందో అక్కడే యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇలా గంటో రెండు గంటలో కాదు. ఏడు నెలల పాటు ఎదురు చూడసాగింది. ఆ దారిలో వెళ్తూ దీనిని చూసిన మోటారిస్టులు, అది ఎవరికోసమో ఎదురు చూస్తోందని గ్రహించి, దానికి ఆహారం అందించసాగారు. మరి కొందరు దానికి నీడ కోసం తమ గొడుగులతో చిన్న సైజు నివాసం ఏర్పాటు చేశారు. ఇలా రోజులు నెలలయ్యాయి. దీని గురించి స్థానికులు మీడియాకు సమాచారం అందజేయడంతో వారు దీని గురించి టీవీలో ప్రసారం చేశారు. దీనిని చూసిన బిగ్ బ్లూ యజమాని హుటాహుటీన వెళ్లి దానిని ఇంటికి తెచ్చుకున్నారు. యజమానిని చూసిన కుక్క ఆనందానికి అవధులు లేకపోతే, దాని విశ్వాసానికి ముగ్ధుడైన యజమాని దానిపై అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు. అది ఇంటికి చేరేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News