: సల్వీందర్ మాటే నిజమైంది!...‘పఠాన్ కోట్’లో ఆయన ప్రమేయమేమీ లేదని తేల్చిన ఎన్ఐఏ
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆ రాష్ట్ర పోలీసు అధికారి, గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదట. రోజుల తరబడి ఆయన ప్రమేయంపై విచారణ జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చివరకు దాడిలో ఆయన పాత్ర లేదన్న అభిప్రాయానికి వచ్చింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు సల్వీందర్ తో పాటు ఆయన వంట మనిషి, స్నేహితుడిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ సందర్భంగా పొంతన లేని సమాధానాలు చెప్పిన సల్వీందర్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ఎన్ఐఏ ఆయనకు ఇటీవలే సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు కూడా చేసింది. విచారణ సందర్భంగా సల్వీందర్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. ‘‘పది రోజులు విచారించినా... నా నుంచి ఏమీ రాబట్టలేరు. ఎందుకంటే నాకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆయన ఇటీవల ఎన్ఐఏ అధికారులకు తేల్చిచెప్పారు. అయినా సత్య శోధన పరీక్షలకే మొగ్గుచూపిన ఎన్ఐఏ చివరకు సల్వీందర్ వాదనతోనే ఏకీభవించక తప్పని పరిస్థితి. దాడిలో సల్వీందర్ పాత్రకు సంబంధించి ఆధారాల కోసం మొన్న గురుదాస్ పూర్ తో పాటు సల్వీందర్ సొంతూరు అమృత్ సర్ లోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారులకు ఏమీ లభించలేదు. దీంతో ఈ దాడిలో సల్వీందర్ కు ఎన్ఐఏ అధికారులు క్లీన్ ఇచ్చేశారు.