: ఏపీ కొత్త సీఎస్ గా ఎస్పీ ఠక్కర్... సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న పదవీ విమరణ చేయనున్నారు. యుక్త వయసులోనే ఐఏఎస్ అధికారిగా ఎంపికైన కృష్ణారావు సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మారారు. తెలంగాణ కేడర్ కు వెళ్లిన ఆయనను తమ వద్దే ఉంటాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు అటు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పరిపాలన తరలింపు నేపథ్యంలో కృష్ణారావు కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం రాజధాని తరలింపునకు సంబంధించి కీలక అడుగులు పడనున్న సమయంలో ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో కొత్త సీఎస్ గా బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంపై కొంతకాలంగా వివిధ వాదనలు సాగాయి. సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టే అర్హత ఉన్న సీనియర్ ఐఏఎస్ లు తమ వంతు యత్నాలు చేశారు. అయితే సిన్సియారిటీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సత్య ప్రకాశ్ ఠక్కర్ (ఎస్పీ ఠక్కర్)ను సీఎస్ గా నియమించేందుకు చంద్రబాబు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.