: పరువు దక్కించుకుంటారా?...ర్యాంకు దిగజారుతారా?
సిడ్నీ వన్డేకి టీమిండియా సిద్ధమవుతోంది. వరుసగా నాలుగు వన్డేల్లో ఘోరపరాజయం పాలైన భారత జట్టు ఐదో వన్డేలోనైనా నెగ్గి పరువు దక్కించుకుంటుందా? లేక నాలుగో వన్డేలోలా చతికిలబడుతుందా? అని సగటు అభిమాని ఆలోచనలో పడ్డాడు. భారత జట్టు ఆటతీరుతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇన్నింగ్స్ ప్రారంభించి ఓటమిపాలైన భారత జట్టు ఛేజింగ్ ధాటిగా ఆరంభించడంతో నాలుగో వన్డేలో విజయం సాధిస్తారని అభిమానులు ఆశించారు. వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ, టీమిండియా మిడిలార్డర్, టైలెండర్లు సైకిల్ స్టాండును తలపించారు. ఇక చివరి వన్డేలో భారత జట్టు ఓటమిపాలైతే అభిమానుల్లో అనాసక్తి పెరుగుతుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే, టెస్టు ర్యాంకింగ్స్ లో భారత జట్టు స్థానం మరింత దిగజారుతుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు చివరి వన్డేలో విజయం సాధించి సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో చివరి వన్డేలో ఆటగాళ్లతో ప్రయోగాలకు సన్నాహాలు చేసుకుంటోంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఆటగాళ్లను బరిలో దించి, వారి సత్తాను పరీక్షించాలని భావిస్తోంది.