: 'భలే మంచి తరుణం'... కేంద్రానికి మాత్రమే!, ద్రవ్య లోటు పేరు చెప్పి మరో 'పెట్రో' వడ్డన!


పెట్రో ధరల విషయంలో "ప్రజలు ఏమైపోతేనేం, మన ఖజానా కదలకుండా ఉంటే చాలు" అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేంద్రం మరో మారు ఎక్సైజ్ పన్నులను పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2015-16 బడ్జెట్ లో ద్రవ్యలోటును అధిగమించాలంటే, పెట్రోలు ధరలను తగ్గించకుండా చూసుకుంటే చాలని నిర్ణయించుకున్న మోదీ సర్కారు ఇప్పటికే పలు మార్లు పెట్రోలు, డీజెల్ లపై సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే. లేకుంటే, రూ. 30కి దిగిరావాల్సిన పెట్రోలు ధర ఇంకా రూ. 60పైనే ఉందంటే, అది మన ప్రభుత్వాల పుణ్యమే. ఇక మరో వారంలో ఇంకోసారి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సమావేశమై పెట్రోలు ధరలను సమీక్షిస్తాయి. ఇప్పటికే భారత క్రూడ్ బాస్కెట్ ధర బ్యారలుకు 30 డాలర్ల దిగువకు చేరిన సందర్భంలో మరోసారి పెట్రోలు, డీజెల్ ధరల తగ్గింపు తప్పనిసరిగా తెలుస్తోంది. ఆ వెంటనే ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకోవాలన్నది మోదీ సర్కారు అభిమతంగా తెలుస్తోంది. ప్రస్తుత సంవత్సరపు ద్రవ్యలోటు 3.9 శాతాన్ని అధిగమించాలంటే 'పెట్రో' ధరలు మాత్రమే ప్రభుత్వం ముందు కనిపిస్తున్నాయని స్వయంగా ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిన పెట్రోలు ధరల ప్రయోజనాన్ని ప్రజలకు అందనీయకుండా చేసిన కేంద్రం ఇప్పటికే రూ. 14 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఖజానాకు చేర్చుకుంది. దీనికి అదనంగా ఎగుమతుల బిల్లూ తగ్గింది. గతవారంలో పెట్రోలుపై 75 పైసలు, డీజెల్ పై రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని విధించిన కేంద్రం ఖజానాకు అదనంగా రూ. 3,700 కోట్లను చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముడిచమురు ధరలు 12 ఏళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. బ్యారల్ క్రూడాయిల్ ధర 29 డాలర్ల కన్నా దిగువనే ఉంది. ఇది మరింత పతనమవుతుందని నిపుణుల అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 69 వేల కోట్లను ఖజానాకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకుని విఫలమైన కేంద్రం 'పెట్రో' ఉత్పత్తులపై సుంకాల పెంపు ద్వారా లక్ష్యంలో కొంత దూరాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే మరోమారు పెట్రోలు ధరలు తగ్గినా, ఆ లబ్ధి మాత్రం ప్రజలకు దక్కకపోవచ్చు!

  • Loading...

More Telugu News