: హెచ్ సీయూ దారిలో రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం! దళిత స్కాలర్ ను వేధించినందుకు వీసీపై ఎఫ్ఐఆర్


ఓవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల మరణానంతరం చెలరేగిన అల్లర్లు కొనసాగుతుండగానే, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి సస్పెన్షన్ వివాదం కలకలం రేపుతోంది. వర్శిటీ వైస్ చాన్స్ లర్ ఏకే పుజారీ, కొందరు ప్రొఫెసర్లు ఓ దళిత స్కాలర్ ను వేధించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ మేరకు అజ్మీర్ పోలీసులు వీసీ సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 'హిందుస్థాన్ టైమ్స్' కథనం ప్రకారం, రీసెర్చ్ స్కాలర్ ఉమేష్ కుమార్ జోన్వాల్ ను ప్రొఫెసర్ జగదీష్ ఉల్లాస్ జాదవ్, అసోసియే ప్రొఫెసర్ అహ్మద్ తదితరులు వేధించారు. రెండు వారాల పాటు వర్శిటీకి రాలేదన్న కారణంతో జోన్వాల్ ను గత సంవత్సరం అక్టోబరులో సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, వర్శిటీ విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ బీఎల్ మీనా, నిబంధనలకు విరుద్ధంగా సదరు స్కాలర్ పై చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆ విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదన్న సర్టిఫికెట్లు దాఖలు చేసినప్పటికీ, వాటిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా, ప్రొఫెసర్ జాదవ్ ప్రతి సెమిస్టర్ కూ రూ. 10 వేల చొప్పున మూడు సార్లు తన నుంచి లంచం తీసుకున్నారని, ఆపై డబ్బు కట్టలేకపోవడంతో తిట్టి, వేధించారని జోన్వాల్ ఆరోపించాడు. కాగా, లంచం విషయంలో జాదవ్ వాదన మరోలా ఉంది. తాను విద్యార్థికి రూ. 30 వేలు అప్పుగా ఇచ్చానని, దాన్ని మూడు వాయిదాల రూపంలో తన ఖాతాలో వేశాడని చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News