: 90 సెకన్లకు ఓ రైలా?...కుదరదు మిలార్డ్!
ఢిల్లీ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా మెట్రో రైలు సర్వీసులను 90 సెకన్లకు ఒకటి నడపాలన్న సుప్రీంకోర్టు సూచనలు ఆచరణ సాధ్యం కాదని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. కాలుష్యం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా మెట్రో రైళ్ల మధ్య సమయాన్ని మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం సగటున 2:15 నిమిషాలకో సర్వీస్ తిరుగుతోందని మెట్రో తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతి కేసును విచారించగా, ప్రస్తుతం 1,300 కోచ్ లు ఉన్నాయని, మరో 429 కోచ్ లకు ఆర్డర్ ఇచ్చామని వీటిని దశలవారీగా డిసెంబరులోగా రైళ్లకు జోడిస్తామని రంజిత్ కుమార్ తెలిపారు. 90 సెకన్లకు ఓ రైలు నడపడం ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు. నిత్యమూ 3,200 ట్రిప్పులు తిరిగే మెట్రో రైలు సర్వీసులను ఈ నెల 1 నుంచి 15 వరకూ సరి-బేసి విధానం అమలు సమయంలో మరో 70 అదనపు ట్రిప్పులు తిప్పినట్టు ఆయన తెలిపారు. ఈ సంఖ్యను మరింతగా పెంచివుండాల్సిందని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.