: అమెరికన్లకు హెచ్చరిక... వందేళ్లలో అత్యధిక స్నోఫాల్, మంచులో కూరుకుపోతున్న వాషింగ్టన్, 15 రాష్ట్రాలపై ప్రభావం!
గడచిన 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత మంచు వాషింగ్టన్ నగరాన్ని కప్పేసింది. ఇప్పటికే ఒక అంతస్తు ఉన్న భవంతులన్నీ మంచులో కూరుకుపోగా, మరింత మంచు వర్షం, శీతలగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్ సహా బాల్టీమోర్ తదితర నగరాల్లో రెండు అడుగుల మేర మంచు స్వల్ప సమయంలో కురిసిందని, రాబోయే రెండు రోజుల్లో 15 రాష్ట్రాల్లో భారీ మంచు తుపానులు రావచ్చని వెదర్ చానల్ పేర్కొంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్ డబ్ల్యూఎస్) వెల్లడించింది. వారాంతం వరకూ న్యూయార్క్ లో మంచు కురుస్తూనే ఉంటుందని, ప్రజల జీవనానికి, ఆస్తులకు ఇది ప్రమాదకరమని 'వాషింగ్టన్ బులెటిన్'లో ఎన్ డబ్ల్యూఎస్ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి, శనివారం రహదార్లపైకి రావద్దని పేర్కొంది. ఈ మంచు తుపాను ప్రభావం 5 కోట్ల మంది అమెరికన్లపై ప్రభావం చూపవచ్చని ఎన్ డబ్ల్యూఎస్ డైరెక్టర్ లూయిస్ ఉసిలెన్నీ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ పరిధిలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్టు మేయర్ మురియల్ బౌసర్ తెలిపారు. అవసరమైతే ఫెడరల్ అధికారుల సాయం తీసుకోనున్నట్టు తెలిపారు. శుక్రవారం నాడు అన్ని పాఠశాలలకూ సెలవు ప్రకటిస్తున్నట్టు వివరించారు. తాను పుట్టినప్పటి నుంచి వాషింగ్టన్ లోనే ఉన్నానని, ఈ తరహా మంచు తుపాను ఇప్పటి వరకూ చూడలేదని ఆమె అన్నారు. కాగా, వర్జీనియా గవర్నర్ టెర్రీ మెక్ అలీఫ్, మెరీల్యాండ్ గవర్నర్ లారీ హోగాన్ లు సైతం తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.