: పరిచయం, ప్రేమ, హత్య... 20 రోజుల్లో విషాదాంతమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఫేస్ బుక్ స్నేహం!


కేవలం 20 రోజుల ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారి, ఆపై అది ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్యకు దారితీసింది. నా జీవితాంతం నువ్వేనని తీయటి మాటలు చెప్పిన వాడు నిర్దయగా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఐబీఎం సంస్థలో పనిచేస్తున్న కుసుమ్ రాణి సింగ్లా (31) ఆరు నెలల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. గతంలో యాక్సెంచర్, యాహూ తదితర సంస్థల్లో పనిచేసిన సుఖ్ వీర్ సింగ్ (28) అనే నిరుద్యోగి ఫ్రెండ్ రిక్వెస్ట్ తో వచ్చాడు. తొలుత నిరాకరించిన రాణి తరువాత సరే చెప్పింది. ఇద్దరూ గంటల కొద్దీ చాటింగ్ చేసుకునేవారు. భర్త నుంచి విడిపోయిన కుసుమ్ ఒంటరిగా ఉంటున్నదని తెలుసుకున్న సుఖ్ వీర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఈ విషయంలో మాటలు జరుగుతున్న సమయంలో అతను అనుకోకుండా బెంగళూరుకు వచ్చేశాడు. రాణి అనుమతితోనే ఆమె ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లాడు. కాసేపు ముచ్చట్ల తరువాత ఇద్దరూ కలిసి లంచ్ చేశారు కూడా. ఆపై తనకు రూ. 50 వేలు కావాలని అడిగాడు. అప్పుడు అతని నిజస్వరూపం అర్థమై ఆమె ససేమిరా అంది. దీంతో సుఖ్ వీర్ లోని అసలు కోణం బయటకు వచ్చింది. పెన్నుతో ఆమె నుదుటిపై పొడిచి, ల్యాప్ టాప్ చార్జింగ్ వైరును మెడకు బలంగా చుట్టి హత్య చేశాడు. తన బట్టలకు రక్తపు మరకలైతే, వాటిని అక్కడే వదిలి రాణి ప్యాంట్ ను వేసుకున్నాడు. ఆమె నగలు, ఫోన్లు, బ్యాంకు కార్డులు తీసుకుని, రూ. 11 వేలు డ్రా చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె స్నేహితురాలిని, ఆపై మాజీ భర్తను ప్రశ్నించి వదిలేశారు. ఫేస్ బుక్ లో పరిచయమైన సుఖ్ వీర్ గురించి తెలుసుకుని గుర్గావ్ లో అతన్ని అరెస్ట్ చేశారు. హత్య మంగళవారం జరుగగా, 48 గంటల్లోనే సుఖ్ వీర్ ను పోలీసులు కటకటాల వెనక్కు తోసేశారు.

  • Loading...

More Telugu News