: కరెన్సీ కట్టలతో శంషాబాదు ఎయిర్ పోర్టుకు వచ్చిన వ్యక్తి... అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విమానాల్లో మొన్నటిదాకా కిలోల లెక్కన బంగారు బిస్కెట్లు వచ్చేవి. అయితే ఇటీవల ఈ తరహా స్మగ్లింగ్ కాస్తంత తగ్గినా.. కొద్దిసేపటి క్రితం రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో తరహా అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నేటి ఉదయం విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద రూ.1 కోటి విలువ చేసే విదేశీ కరెన్సీ కట్టలు లభ్యమయ్యాయి. కువైట్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సదరు ప్రయాణికుడి బ్యాగ్ లో కరెన్సీ కట్టలు చూసి డీఆర్ఐ అధికారులే నివ్వెరపోయారట. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు సదరు వ్యవహారంపై సమగ్ర వివరాలు రాబడుతున్నారు.